: రాజకీయనాయకుల తప్పిదానికి... పోలీస్ స్టేషన్ లో గాడిద!
రాజకీయ ర్యాలీకి అనుమతి తీసుకున్నా... ఆ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గాడిదకు మాత్రం అనుమతి లేదు. దీంతో ఆ గాడిదను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మాలెగావ్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ జేడీ(ఎస్) కార్యకర్తలు నిన్న రోడ్ షో నిర్వహించారు. ర్యాలీ నిర్వహణకు గాను పోలీసులు అనుమతి ఇచ్చారు. ర్యాలీ మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలని భావించిన జేడీ (ఎస్) నేతలు ఒక గాడిదను కూడా వెంటతీసుకెళ్లారు.
అయితే, ఈ విషయం ముందు తమకు చెప్పలేదంటూ మాలెగావ్ పోలీసులు ఆ మూగజీవాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఆ గాడిదను ఆటోలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత దానిని పంజ్రాలోని జంతుసంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా మాలెగావ్ అదనపు ఎస్పీ కదాస్నే మాట్లాడుతూ, శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశమున్నందునే ఆ గాడిదను అదుపులోకి తీసుకున్నామని, ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు.