: ఇండియా మారడం అంత ఈజీ కాదు: మోదీ నోట ఊహించని మాట
నిత్యమూ అభివృద్ధి, సంస్కరణలు, అవినీతి, కీలక సంస్కరణల అమలు... అంటూ ప్రసంగాలు చేసే మోదీ నేడు ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం ఢిల్లీలో ఆర్థిక సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ, "భారత ఆర్థిక వ్యవస్థలో పరివర్తన అంత సులభం కాదు. ఇదేమీ వంద మీటర్ల పరుగు వంటిది కాదు. పూర్తి చేయడానికి అదో మారథాన్" అన్నారు. అయితే, తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాతి 17 నెలల కాలంలో ఇండియా మెరుగైన స్థితికి చేరిందని మాత్రం చెప్పగలనని అన్నారు.
జీడీపీ వృద్ధి పెరిగిందని, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిందని గుర్తు చేశారు. దేశాన్ని వృద్ధి బాటలో నిలిపేందుకు సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని, అధికారుల్లో పనితీరు మెరుగుపడేందుకు కీలక చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. 2010 నుంచి ఈ తరహా సదస్సులు జరుగుతుండగా, ఈ యేడాది 'రియలైజింగ్ ఇండియాస్ జామ్' (JAM- జన్ ధన్ - ఆధార్ - మొబైల్ విజన్) థీమ్ పై ప్రారంభమైంది. ఇండియాలో ప్రధాని స్వయంగా వచ్చి ఆర్థిక సదస్సును ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇండియాలో మార్పు అంత సులభం కానున్నా, దీర్ఘకాలం పాటు సాగినా, తాము మాత్రం నిబద్ధతతో ముందుకెళ్తామని వివరించారు.