: మార్స్ పై రోవర్ కు కనిపించింది గ్రహాంతరవాసేనా? ఆసక్తిని పెంచుతున్న ఫోటో
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఇకపై ఉన్నాయని చెప్పుకోవాలేమో? అంగారకుడిపైకి (మార్స్) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన రోవర్ తీసిన ఓ చిత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఓ రాతి గుహలో నుంచి బయటకు వచ్చి తనవైపే చూస్తున్న ఓ ఎర్రటి ఆకారాన్ని ఫోటో తీసి భూమిపైకి పంపింది రోవర్. దీన్ని చూసిన పలువురు మార్స్ పై జీవం ఉందనడానికి ఇది సాక్ష్యమని నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన తాను ఎంతో ఆశ్చర్యపోయానని, ఏళ్ల తరబడి ఏలియన్స్ కు సంబంధించిన విషయాలపై పరిశోధనలు చేస్తున్న 'యూఎఫ్ఓ సైటింగ్స్ డైలీ' ఎడిటర్ స్కాట్ సీ వారింగ్ వ్యాఖ్యానించారు. "ఓ చిన్న రాతి గుహ. అందులోంచి బయటకు తొంగిచూస్తున్న గులాబీ లేదా ఎరుపు రంగు ముఖాకృతి. అది జీవమున్న ప్రాణేనా? కావచ్చు" అని ఆయన అన్నారు. నాసా రోవర్ తీసిన ఆ చిత్రం ఇదే.