: సిరిసిల్ల రాజయ్య ఇంటిలో అగ్ని ప్రమాదం... కోడలు సహా ముగ్గురు మనవలు సజీవ దహనం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, వరంగల్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంటిలో నేటి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు (రాజయ్య మనవలు) అభినవ్(7), ఆయోన్(3), శ్రీయోన్(3) లు సజీవ దహనమయ్యారు. వరంగల్ లోని ఒకే ఇంటిలో రాజయ్య తన భార్య సహా కొడుకు, కోడలు, ముగ్గురు మనవలతో కలిసి ఉంటున్నారు. ఈ ఇంటిలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటన జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన ముగ్గురు పిల్లలు పదేళ్ల లోపు వారే. దీంతో వరంగల్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజయ్య కొడుకు, కోడలు మధ్య కొంతకాలంగా అసలు మాటలే లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో వదంతులు వినిపిస్తున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఉప ఎన్నికకు నేడు రాజయ్య నామినేషన్ వేయాల్సి ఉంది. ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ వేసిన ఆయన, నేడు మందీ మార్బలంతో ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్ వేయాల్సి ఉంది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో సిరిసిల్ల నామినేషన్ వేస్తారా? పోటీ నుంచి విరమించుకుంటారా? అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

More Telugu News