: కనీసం టెస్టుల్లోనైనా పరువు మిగులుతుందా?

'స్వదేశంలోనే పులులు' అనే టైటిల్ ను భారత క్రికెట్ జట్టు వదిలేసినట్టు కనపడుతోంది. ఉప ఖండపు పిచ్ లపై భారత్ కు తిరుగులేదని పేరుండేది. అయితే, అదంతా గతమని టీమిండియా నిరూపించింది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో తోకముడిచిన బారత్, తరువాత సౌతాఫ్రికాతో జరిగిన మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా జరిగిన టీట్వంటీ, వన్డే సిరీస్ ను ప్రత్యర్థులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో కనీసం టెస్టుల్లోనైనా పరువు దక్కుతుందా? అనే అనుమానం సగటు అభిమానిలో గూడుకట్టుకుంది. టీమిండియా ఆటగాళ్లలో అంతా ప్రతిభావంతులే, ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం అనేది సెలక్టర్లు, విశ్లేషకుల వాదన. అలాంటప్పుడు టీమిండియా ఎందుకు వరస పరాజయాలు చవిచూస్తున్నట్టు? అంటే ఎవరూ సమాధానం చెప్పరు. ఎందుకంటే అందరూ ప్రతిభావంతులే, కానీ వారి ప్రతిభ అవసరానికి అక్కరకు రాదనేది సగటు అభిమాని వాదన. ఈ క్రమంలో త్వరలో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టుల్లో అయినా టీమిండియా ఆటగాళ్లు రాణిస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ స్టెయిన్ కు తోడు, 7వ ర్యాంకర్ ఫిలాండర్, 11వ ర్యాంకర్ మోర్నీ మోర్కెల్ సఫారీల సొంతం. మరి భారత జట్టుకి 8వ ర్యాంకులో ఉన్న అశ్విన్ మాత్రమే అండ. ఒకే ఒక్క బౌలర్ తో టెస్టు నెగ్గేయడం సాధ్యమైన పనేనా? అంటే సందేహమే. వన్డేలు, టీట్వంటీల్లో విఫలమైన టెస్టు కెప్టెన్ కోహ్లీ ఈసారి ఏం చేస్తాడో చూడాల్సిందే. టెస్టు సిరీస్ కూడా ఓడిపోతే...సరైన ప్రత్యర్థి ఎదురైతే భారత్ చేతులెత్తేస్తుందనే నానుడి నిజం చేసినవారవుతారని అభిమానులు పేర్కొంటున్నారు.

More Telugu News