: గ్రేటర్ లో అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సబ్ కమిటీ సూచనల మేరకు భూముల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు ఏర్పాటు చేశామన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందించామని, అక్టోబర్ 28వ తేదీని కటాఫ్ డేట్ గా నిర్ణయించామని మంత్రి తెలిపారు. అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గడువు పూర్తయిన తరువాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించమని, గృహావసరాలు, వాణిజ్య సముదాయాలకు వేర్వేరుగా అపరాధ రుసుం వసూలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కేసుల పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్రమ లేఅవుట్లు, భవనాలు గుర్తించేందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గూగుల్ మ్యాప్ ల ద్వారా అక్రమ భవనాలు గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు తలసాని పేర్కొన్నారు.

More Telugu News