: 'పాట'ను నమ్ముకున్నవారికి నమస్కారం...అమ్ముకున్న వారికి పదివేల నమస్కారాలు: ప్రజాగాయకుడు వంగపండు
పాటను నమ్ముకున్న వారికి ఒక నమస్కారం...అదే పాటను అమ్ముకున్నవారికి పదివేల నమస్కారాలు' అని ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ, పాటను నమ్ముకున్న వారంతా తిండి లేకున్నా ప్రశాంతంగా ప్రాణం విడిచారని అన్నారు. పాటను అమ్ముకున్న వాళ్లు, తమ పాటకు న్యాయం జరిగిందా? అనేది వారి గుండెల మీద చేయివేసుకుని చెప్పాలని ఆయన అడిగారు. పాట మనిషిలో కదలిక రప్పించేందుకు, మనిషిని చైతన్యవంతం చేసేందుకు సాగాల్సిన కళ అని ఆయన చెప్పారు. అది జరగని నాడు, ఎంత సంపాదించినా ఆ పాటకు అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
డబ్బు కోసం పాటలు రాయడం పెద్ద కళగా మారుతోందని, ఈ భావం సరికాదని, నిజమైన పాటకు అర్థం ప్రజల్లో కదలిక రప్పించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు చదువరులు తక్కువని, అప్పట్లో ప్రజల్లో అవగాహన ఉండేది కాదని, దుర్భరమైన జీవన విధానమే హక్కు అని భావించేవారని, వారిలో చైతన్యం తేవడంలో భాగమే తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధ్యమనే భావం ఉండేదని, ఇప్పుడు కాలంతో పాటు పరిస్థితులు కూడా మారాయని, ఇప్పుడు పోరాటం పంథా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.