: నిఫ్టీ-50లో 32 కంపెనీలు నష్టాల్లోనే!
సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ, నిమిషాల వ్యవధిలో భారీ నష్టం దిశగా సాగిన సూచికలు, ఆపై బ్యాంకులు, ఆటో సెక్టార్లలోని ఈక్విటీలకు వచ్చిన కొనుగోలు మద్దతుతో స్వల్పంగా తేరుకున్నా నష్టం మాత్రం తప్పలేదు. మార్కెట్లకు కొనుగోలు మద్దతు వస్తుందని భావించిన సమయంలో, ఆసియా మార్కెట్ల సరళి కొంతమేరకు అడ్డుకుందని నిపుణులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 97.68 పాయింట్లు పడిపోయి 0.37 శాతం నష్టంతో 26,559.15 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 15 పాయింట్లు పడిపోయి 0.15 శాతం నష్టంతో 8,050.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.20 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు నష్టపోయాయి. టెక్ మహీంద్రా, యస్ బ్యాంక్, ఏసీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభపడగా, బజాజ్ ఆటో, టాటా స్టీల్, వీఈడీఎల్, హిందాల్కో, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టపోయాయి. శుక్రవారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 98,33,359 కోట్లుగా ఉండగా, అది నేడు రూ. 98,23,603 కోట్లకు తగ్గింది. మొత్తం 2,816 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1156 కంపెనీలు లాభాలను, 1,541 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. మిగిలిన 119 కంపెనీల ఈక్విటీ ధరల్లో మార్పు నమోదు కాలేదు.