: తన ఆవిష్కరణతో రికార్డులతో పాటు డిస్కవరీ చానల్ కు ఎక్కిన 'ఇడియట్'!
కేరళలోని మారుమూల ఇడుక్కి గ్రామం. అతని పేరు సాజీ థామస్ (45). పుట్టుకతోనే బధిరుడు. ఇరుగుపొరుగు వారు ముద్దుగా 'పొట్టేన్' అని పిలుచుకుంటారు. పొట్టేన్ అంటే ఇడియట్ అని. చిన్న వయసులో పొలంలో పురుగుమందులు చల్లుతున్న చిన్న విమానాన్ని చూసి అటువంటిదే తయారు చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని మొదలు పెట్టాడు. వాడేసిన పరికరాలు, ఎందుకూ కొరగాని వస్తువులు వాడుతూ, ఇద్దరు ప్రయాణించే వీలున్న తేలికపాటి విమానాన్ని తయారుచేశాడు. దానికి 'సాజీ ఎక్స్ ఎయిర్-ఎస్' అని పేరు పెట్టాడు.
తిరువనంతపురంలోని ఎస్కేజే నాయర్ నెలకొల్పిన ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీలో సాజీ చేసిన విమానం గాల్లోకి ఎగిరి చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు ఆ 'ఇడియట్' చేసిన పని అతన్ని సెలబ్రిటీని చేసింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రయోక్తగా, డిస్కవరీ చానల్ చేపట్టిన 'హెచ్ఆర్ఎక్స్ సూపర్ హీరోస్'లో అతనికీ స్థానం లభించింది. అంగ వైకల్యమున్నా తమ కలలను తీర్చుకునేందుకు శ్రమించి విజయం సాధించిన హీరోల కథలే ఈ 'హెచ్ఆర్ఎక్స్ సూపర్ హీరోస్'.
15 ఏళ్ల వయసులో సాజీ ముంబైకి పారిపోయి, అక్కడ పైలెట్లను కలిసి తన కోరికను సైగల ద్వారానే తెలిపి వారి నుంచి కొంత సమాచారం సేకరించాడట. ఆపై తనకున్న ఐదు సెంట్ల భూమినీ అమ్మేసి, తొలుత ఫ్రేమ్ ను, ఆపై బైక్ ఇంజన్ సాయంతో విమానం ఇంజన్ ను తయారు చేశాడని, ఇందుకు ఎన్నో సంవత్సరాలు శ్రమించాడని అతని భార్య మారియా గర్వంగా చెబుతున్నారు. బైక్ ఇంజన్ తో తయారు చేసిన విమానం గాల్లో ఎగరలేక పోగా, ఈ మోడల్ ను ఓ ఇంజనీరింగ్ కాలేజీలో విక్రయించి, విమాన ఇంజన్ కొనుగోలు చేసి, తన పనిలో విజయం సాధించాడని వివరించారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో ఆయన పేరు నమోదైందని తెలిపారు. పూట గడిచేందుకు రబ్బరు తోటల్లో కూలీగా, ఎలక్ట్రీషియన్ గా, ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తుండేవాడని అన్నారు. ఏదైనా ఏరోనాటిక్స్ కంపెనీ తనకు ఉద్యోగం ఇస్తుందన్న ఆశతో సాజీ ఉన్నారు. ఇప్పుడు తన ట్విన్ ఇంజన్ విమానానికి లైసెన్స్ ను పొందేందుకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు దరఖాస్తు పెట్టుకున్న 'ఇడియట్' సాజీకి ఆల్ ది బెస్ట్ చెబుదామా?