: తొలగించిన ఓట్లపై విచారణ చేపట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటు: దత్తాత్రేయ
గ్రేటర్ హైదరాబాద్ లో తొలగించిన ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టడంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తొలగించిన ఓట్లపై విచారణ చేపట్టడం ఇది రెండోసారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికిది సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ లోని అడిక్ మెంట్ డివిజన్ లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బదిలీకి కారణం ఓట్ల తొలగింపు వ్యవహారమేనని, ఆయన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకొని చివరకు బలిపశువును చేశారని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు నవీన్ మిట్టల్ ను కూడా బలిపశువును చేశారన్నారు. రాజకీయ నాయకులు, మంత్రులు చెప్పినట్టు అధికారులు నడుచుకోవద్దని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని సూచించారు.