: సిక్కులను దారుణంగా చంపినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు: సీఎం కేజ్రీవాల్
'1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో సిక్కులను దారుణంగా చంపినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. వాళ్లను చూస్తే మన రక్తం మరిగిపోతుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆమ్ ఆద్మీపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ అల్లర్లపై సిట్ ను ఏర్పాటు చేశాము' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. 1984 అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కుటుంబాలకు కేజ్రీవాల్ చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ నాడు ఊచకోత బాధితులకు న్యాయం దొరికినట్లయితే, 2002లో గుజరాత్ అల్లర్లు, తాజాగా దాద్రీ లాంటి సంఘటనలకు ఆస్కారం ఉండేది కాదన్నారు. సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ సహా ఇతర పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయని, బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదని కేజ్రీవాల్ విమర్శించారు.