: బిజినెస్ పై శ్రీని దృష్టి.... కూతురుతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన


ప్రపంచ క్రికెట్ వర్గాలు శ్రీని అని ముద్దుగా పిలుచుకునే ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ ఎప్పుడు మీడియాలో కనిపించినా వ్యాపారవేత్తగా కంటే క్రికెట్ అత్యున్నత అధికారిగానే చెలామణి అయ్యారు. అయితే అల్లుడు గురునాథ్ మెయెప్పన్, ఐపీఎల్ లో ఆయన నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ పీఠం నుంచి ఆయన దిగిపోవాల్సి వచ్చింది. తనను చుట్టుముట్టిన వివాదాలు సమీప భవిష్యత్తులో దూరమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వాస్తవాన్ని గ్రహించిన ఆయన ఇక తన వ్యాపార సామ్రాజ్యంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. నిన్న తన కూతురు రూపా గురునాథ్ తో కలిసి ఆయన చెన్నై నుంచి వచ్చి హైదరాబాదులో వాలిపోయారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఇండియా సిమెంట్స్ ప్లాంట్ ను సందర్శించారు. చాలా సేపు కంపెనీలోనే ఉన్న శ్రీని, కర్మాగారంలోని దాదాపు అన్ని విభాగాల్లో కలియదిరిగారు. అనంతరం కార్మికులతోనూ భేటీ అయ్యారు. కంపెనీని లాభాల బాటలో పయనించేలా కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత హైదరాబాదు నుంచి నేరుగా విజయవాడలో ల్యాండైన శ్రీని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తమ కంపెనీ తరఫున భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News