: కరివేపాకే కదా అని తీసిపారేయకండి!
మన వంటకాల్లో కరివేపాకుకు అత్యంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ... దాన్ని తినకుండా తీసిపారేసే వారే ఎక్కువ. మరోవైపు, 'కరివేపాకులా తీసిపారేశారు' అంటూ పలువురు వాపోవడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే కరివేపాకుకు ఉన్న గొప్పదనం అంతా ఇంతా కాదు. మన శరీరానికి ఎంతో అవసరమైన ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, బీ విటమిన్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, తాజా కరివేపాకులో కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, క్యాలరీలు కూడా అందుతాయి. ఇలా అత్యధిక పౌష్టిక విలువలు కలిగిన కరివేపాకును మనం కేవలం రుచి కోసమే వాడుతున్నాం. గతంలో అయితే కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి ఇలా కరివేపాకు మన భోజనంలో ఒక భాగంగా ఉండేది. మారుతున్న అలవాట్లలో భాగంగా కరివేపాకు వాడకం తగ్గిపోతోంది. కరివేపాకు వినియోగం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జీర్ణక్రియ ఇబ్బందులను తొలగిస్తుంది. కొలెస్టరాల్ ను, మధుమేహాన్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్ గా కరివేపాకును స్వీకరిస్తే మూత్రపిండాల వ్యాధులు తొలగిపోతాయి. దురదలు తగ్గుతాయి. వికారం, వాంతులు, మార్నింగ్ సిక్ నెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకు ఆకులను నూరి నెయ్యిని గాని, వెన్నను కాని కలిపి కాలిన గాయాలపై పూయడం వల్ల తొందరగా తగ్గడంతోపాటు, మచ్చలు కూడా పడకుండా ఉంటాయి. ఎముకల బలహీనత గలవారికి కరివేపాకు ఎంతో మంచిది. కరివేపాకు వేసి కాచిన నూనెను తలకు రాసుకుంటే జుట్టు పెరగడమే కాక నల్లదనాన్ని కూడా సంతరించుకుంటుంది. ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు కరివేపాకు ద్వారా మనకు లభిస్తున్నాయి. ఇంతటి గొప్ప కరివేపాకును తినకుండా, తీసి పారేయడం ఎంతవరకు సబబో మీరే నిర్ణయించుకోండి.