: చంద్రబాబును సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు: బొత్స
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థం కోసం ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడగబోయి, తడబాటులో ప్రత్యేక ప్యాకేజీ అడిగానంటూ చంద్రబాబు చెప్పారని... ఆయన ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే ఆచరిస్తున్నారని... చంద్రబాబును ఆయన సొంత పార్టీ నేతలే నమ్మడం లేదని అన్నారు. ప్రధానికి చంద్రబాబు పంపిన నివేదికలో ఏముందో బయటపెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఆ నివేదికలో ప్రత్యేక హోదా అంశం ఉందో, లేదో ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు.