: దేవాన్ష్ మెడలో పసుపు కండువా అతడి తాత వేస్తారు!... భువనేశ్వరి ప్రశ్నకు రేవంత్ సరదా సమాధానం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి మనవడు దేవాన్ష్ కు ఇంకా మాటలే రాలేదు, అప్పుడే అతడి రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర చర్చ జరిగింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వేదికగా దేవాన్ష్ నానమ్మ నారా భువనేశ్వరి, టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల మధ్య విజయదశమినాడు ఈ సరదా సంభాషణ జరిగింది. దేవాన్ష్ ను ఎత్తుకుని అతడి అమ్మమ్మ వసుంధర కూర్చోగా, ఆమె పక్కన బ్రాహ్మణి, ఆ పక్క సీట్లో భువనేశ్వరి కూర్చుని అతడితో ఆటాడుకుంటుండగా, అక్కడికి రేవంత్ రెడ్డి వచ్చారు.
తన మెడలోని అమరావతి కండువాను బాలుడి మెడలో రేవంత్ వేశారు. ‘‘అమరావతి కండువా వేశారు. మరి పసుపు కండువా ఎప్పుడు వేస్తారు?’’ అన్న భువనేశ్వరి సరదా ప్రశ్నకు రేవంత్ రెడ్డి కూడా వెనువెంటనే స్పందించారు. ‘‘అమరావతి భవిష్యత్తు కాబట్టి ... భవిష్యత్తులో అమరావతిని పరిపాలించాలని ఈ కండువా వేశాను. పసుపు కండువా ఆయన తాతగారు వేస్తారులెండి’’ అని రేవంత్ చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వేశారు.