: రైళ్లలో మంచి నీటి స్కామ్... ఇద్దరు అధికారులు, కాంట్రాక్టరుకు రిమాండ్
రైళ్లలో మంచినీటిని అందించే కాంట్రాక్టులను పొంది అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంపై వ్యాపారవేత్త, ఆర్కే అసోసియేట్స్ యజమాని షరన్ బిహారీ అగర్వాల్, రైల్వే అధికారులు సందీప్ సిలాస్, ఎంఎస్ చాలియాలకు ప్రత్యేక సీబీఐ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించింది. ఈ కేసులో నిందితులను 5 రోజుల పాటు విచారించిన సీబీఐ అధికారులు ప్రస్తుతానికి వీరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని కోర్టుకు వెల్లడించారు.
'రైల్ నీర్' బ్రాండ్ స్థానంలో ఇతర ప్రైవేటు కంపెనీలను వీరు రైళ్లలోకి అనుమతించగా, రైల్వే శాఖకు రూ. 6.25 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వీరితో పాటు సత్యం క్యాటరర్స్, అంబుజ్ హోటల్ అండ్ రియల్ ఎస్టేట్, పీకే అసోసియేట్స్, సన్ షైన్ ప్రైవేట్ లిమిటెడ్, బృందావన్ ఫుడ్స్, ఫుడ్ వరల్డ్ తదితర కంపెనీలపైనా కేసులు రిజిస్టర్ చేయనున్నట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణలో భాగంగా నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తే రూ. 28 కోట్ల నగదు లభించిందని పేర్కొంది.