: జర్నలిస్టులపై చిందులేసిన తెలంగాణ హోం మంత్రి...గాలివార్తలపై వివరణ అడిగితే కేసు పెడతామని వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తోందని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ ఆరోపణలు నిజమనేలా ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాలి వార్తల (పుకార్లు)పై వివరణ అడిగితే కేసులు పెడతామంటూ ఆయన జర్నలిస్టులను హెచ్చరించారు.
హైదరాబాదులోని చంచల్ గూడ్ జైల్లో నూతన బ్యారక్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వార్తలపై ఆయనను విలేకరులు వివరణ కోరారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడైన ఆయన మీడియా ప్రతినిధులపై శివాలెత్తిపోయారు. గాలి వార్తలపై వివరణ కోరితే కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నపళంగా మంత్రి కేసులు పెడతామని బెదిరించడంపై జర్నలిస్టులు షాక్ తిన్నారు.