: ప్రధాని మోదీకి ఇదే నా శాపం: గంగా భవానీ
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పాపానికి బీజేపీ మట్టికొట్టుకుపోతుందని...ఇదే తన శాపమని కాంగ్రెస్ మహిళా నేత గంగా భవానీ తెలిపారు. అమరావతి శంకుస్థాపన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నాడు ప్రత్యేకహోదాపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన చేస్తే, ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని అడిగిన బీజేపీ, అధికారంలోకి రాగానే మాట మార్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొడుతోందని ఆమె ఆరోపించారు.
ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసిన మోదీ అంతకు అంత అనుభవిస్తారని, ఆ పార్టీ మట్టికొట్టుకుపోతుందని ఆమె శాపనార్థాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేసిందని ఆమె మండిపడ్డారు. తక్షణం ప్రత్యేకహోదా, ప్యాకేజీ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. రేపు ప్రధాని దిష్ఠి బొమ్మలు తగులబెడతామని ఆమె వెల్లడించారు.