: ‘హోదా’పై ప్రకటన లేనట్టే... నీతి ఆయోగ్ నివేదిక సిద్ధం కాకపోవడమే కారణమట!

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏపీకి వస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలోని ఉద్ధండరాయునిపాలెంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆయన అమరావతికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఏపీకి ఊరట లభించాలంటే ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కూడా కావాల్సిందేనని అటు విపక్షాలతో పాటు, ఇటు అధికార పక్షం టీడీపీ కూడా కేంద్రం వద్ద తన డిమాండ్ ను వినిపించింది. నేటి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ ఈ రెండింటినీ ప్రకటిస్తారని అంతా ఆశించారు. అయితే నేడు అలాంటి ప్రకటనలేవీ ఉండబోవని విశ్వసనీయ సమాచారం. గతంలో మాదిరే రాష్ట్రానికి అన్ని విషయాల్లో అండగా ఉంటామని మాత్రం మోదీ ప్రకటిస్తారట. అయినా ఏపీకి ప్యాకేజీ, హోదాల ప్రకటనకు అడ్డుగా నిలిచిన విషయం ఏమిటో తెలుసా? హోదా, ప్యాకేజీల అమలు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాల్సిన నీతి ఆయోగ్ అధికారులు ఇప్పటికీ తమ పూర్తి చేయలేదట. దీనికి సంబంధించిన నివేదికకు నీతి ఆయోగ్ అధికారులు ఇప్పటికీ తుది రూపు ఇవ్వలేదు. ఈ నివేదిక ఖరారయ్యేసరికి మరో పక్షం రోజులు పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమంలో భాగంగా ప్రధాని భరోసా ప్రకటన మాత్రమే చేస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News