: అమరావతికి ప్రతి ఊరి మట్టి... వింటుంటేనే ఒళ్లు పులకిస్తోంది: సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్

అమరావతి శంకుస్థాపనకు "మన ఊరు, మన మట్టి, మన నీరు, మన అమరావతి" అనే కాన్సెప్ట్ చాలా బాగుందని 'మా' అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కితాబిచ్చాడు. ఈ ఉదయం శంకుస్థాపన వేదిక వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడాడు. ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు తేవడం తనను ఉద్వేగానికి గురి చేసిందని, ప్రతి ఊరి మట్టి ఇక్కడ కలిసిందన్న విషయం వింటుంటేనే ఒళ్లు పులకిస్తోందని తెలిపాడు. పుట్టిన తరువాత, జన్మలో మరచిపోలేని సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే అందులో ఒకటి రాజధాని శంకుస్థాపనగా గుర్తుండి పోతుందని ఆయన వివరించాడు. ఎంత వయసు వచ్చినా, పాత జ్ఞాపకాల్లో ఇది పదిలంగా నిలుస్తుందని అన్నాడు. పురాణాల్లో అమరావతిని ఇంద్రుడు పాలిస్తే, ఈ అమరావతిని మన చంద్రుడు నిర్మిస్తున్నాడని అన్నాడు. ఇది 'నభూతో నభవిష్యతి' అని అభివర్ణించాడు. ఇక్కడకు వచ్చే అతిథులను స్వాగతించేందుకే తాను ఒకరోజు ముందు వచ్చానని తెలిపాడు. ఇక్కడి ఏర్పాట్లు చూశాక అమరావతి అందరి గుండెల్లోకి ఎక్కేసిందని తనకు తెలిసిపోయిందని అన్నాడు.

More Telugu News