: డబ్బులున్న దళితుడు వివేక్ ను సీఎం చేస్తానని కేసీఆర్ అన్నాడు: కలకలం రేపిన నంది ఎల్లయ్య కామెంట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య నిన్న చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్య కలకలం రేపింది. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పార్టీ కురువృద్ధుడు, దివంగత నేత వెంకటస్వామి కుమారుడు వివేక్ ల సమక్షంలో నంది ఎల్లయ్య సదరు వ్యాఖ్య చేశారు. నంది ఎల్లయ్య వ్యాఖ్యతో వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలకు నోట మాట రాలేదు. ఇంతకీ నంది ఎల్లయ్య చేసిన వ్యాఖ్య ఏంటంటే... ‘‘సీఎం కేసీఆర్... మా వెంకటస్వామి కుమారుడు వివేక్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని, దళితుడిని సీఎంను చేస్తానని అన్నాడు’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు దళితుడినే తొలి సీఎంను చేస్తామని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. నాటి కేసీఆర్ ప్రకటనను ఊటంకించిన నంది ఎల్లయ్య డబ్బులున్న దళితుడినే సీఎం చేస్తానని చెప్పారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. అంతేకాక తమ పార్టీ నేత వివేక్ ను సీఎం కుర్చీలో కూర్చోబెడతానని కేసీఆర్ చెప్పినట్లుగా ఎల్లయ్య వ్యాఖ్యానించారు. నంది ఎల్లయ్య వ్యాఖ్యతో వేదికపై ఉన్న వివేక్ షాక్ కు గురి కాగా, కాస్తంత సంయమనంతో వ్యవహరించిన ఉత్తమ్... ఎల్లయ్య వ్యాఖ్యకు అపార్థాలు జోడించవద్దని సర్దిచెప్పారు.