: ‘నకిలీ’ సూత్రధారి ‘అనంత’ బాల్ రెడ్డి... పోలీసులు పట్టేశారు!
మెడికల్ కౌన్సిలింగ్ లో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో సీట్లు కొల్లగొట్టిన విద్యార్థుల వెనుక ఉన్న అసలు సూత్రధారిని పోలీసులు గుర్తించారట. అనంతపురం జిల్లాకు చెందిన బాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ మొత్తం తతంగానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించాడు. కర్నూలు జిల్లా కల్లూరు మండల తహశీల్దార్ కార్యాలయం నుంచి నకిలీ బీసీ సర్టిఫికెట్లను పొందిన ఆరుగురు విద్యార్థులు మెడికల్ సీట్లను సాధించారు.
అయితే కౌన్సిలింగ్ లోనే వీరిపై అనుమానం వచ్చిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సదరు విద్యార్థుల సర్టిఫికెట్లు నకిలీవని తేల్చగా, వాటిని సాధించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కూపీ లాగిన పోలీసులు ఈ వ్యవహారానికి తెర తీసిన వ్యక్తి బాల్ రెడ్డిగా గుర్తించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కోసం నిన్నటి నుంచే వేట ప్రారంభించారు. నేటి ఉదయం అనంతపురంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.