: ఏపీలో ఇద్దరు డీఈఓల సస్పెన్షన్...కర్నూలు డీఈఓపై లైంగిక వేధింపుల ఆరోపణలు!
ఏపీ పాఠశాల విద్యా శాఖలో భారీ కుదుపు చోటుచేసుకుంది. నిన్న ఒకే దెబ్బతో రెండు జిల్లాల విద్యాశాఖాధికారులపై చంద్రబాబు సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వేటు పడ్డ వారిలో కర్నూలు జిల్లా డీఈఓతో పాటు కృష్ణా జిల్లా డీఈఓ కూడా ఉన్నారు. వివరాల్లోకెళితే... కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న సుప్రకాశ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. తన అధికార దర్పాన్ని ఆసరా చేసుకుని ఆయన మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
ఓ మహిళా టీచర్ తో సుప్రకాశ్ జరిపిన అసభ్యకర సంభాషణ ఆడియో టేపు ఇటీవల జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించగా, సుప్రకాశ్ లైంగిక వేధింపులు నిజమేనని తేలింది. ఇక కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించలేదట. దీంతో వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నారు.