: మరోమారు ఆర్థిక ఇబ్బందుల్లో తెలంగాణ...ఆర్బీఐ వేలంలో రూ.1,200 కోట్ల సేకరణ

దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థిక ఇబ్బందులు ముప్పేట దాడి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ పన్ను కింద ఆర్బీఐ చెప్పాపెట్టకుండా రూ. 1,257 కోట్లను ఆదాయపన్ను శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు నెలల పాటు తెలంగాణ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పలు దఫాల అభ్యర్థనలతో గత నెలలో కేంద్రం ఆ నిధులను తెలంగాణకు విడుదల చేసింది. ఈ నిధులు వచ్చాయో, లేదో ఈ నెల మరో ఇబ్బంది వచ్చి పడింది. గత నెలలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిందట. దీంతో మరోమారు క్లిష్ట పరిస్థితులు తప్పవన్న భావనతో ప్రభుత్వం చెల్లింపులపై ఆంక్షలు విధించింది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషించింది. ఆర్బీఐ నిర్వహించిన వేలం తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. నిన్న ముంబైలో జరిగిన వేలంలో ప్రభుత్వం రూ.1,200 కోట్ల విలువైన బాండ్లను విక్రయించింది. ఫలితంగా 7.97 శాతం వార్షిక వడ్డీ కింద ప్రభుత్వానికి రూ.1,200 కోట్ల రుణం లభించినట్టైంది. నేటి సాయంత్రం లోగా ఈ నిధులు తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయట.

More Telugu News