: ఎమ్మెల్యే చనిపోయాడంటూ ఆకతాయిల వాట్సప్ పోస్టింగులు...‘థర్డ్ ఐ’తో పట్టేసిన పోలీసులు
ఆకతాయిల చేష్టలు అటు పోలీసులను పరుగులు పెట్టిస్తుండగా... ప్రజా ప్రతినిధులు, ప్రజలను తీవ్ర అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. హైదరాబాదు పాతబస్తీలోని యాకుత్ పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చనిపోయారంటూ ఓ యువకుడు వాట్సప్ లో మెసేజ్ పెట్టేశాడు. ఈ నెల 8న వాట్సప్ సహా ఫేస్ బుక్ లో చేరిన ఈ మెసేజ్ లో ‘‘యాకుత్ పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మృతి చెందారు. రేపు మధ్యాహ్నం మక్కా మసీదులో జనాజ్ నమాజ్ ఉంది. దీనికి అందరూ హాజరు కావాలి’’ అంటూ అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ రాషేద్ అలియాజ్ మహ్మద్ జుబేర్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నాడు. అతడి స్నేహితుడు షేక్ ఇమ్రాన్ ముందూ వెనుకా చూసుకోకుండానే దానిని తన మిత్ర బృందానికి షేర్ చేశాడు. అసలే పాతబస్తీ, ఆపై ఎంఐఎం ఎమ్మెల్యే చనిపోయారన్న వార్త క్షణాల్లో వేల మందికి చేరిపోయింది. ముంతాజ్ అనుచరులు, నియోజకవర్గ ప్రజలు హుటాహుటిన ఆయన ఇంటికెళ్లి చూడగా, సదరు వార్త అవాస్తవమని తేలింది. దీంతో ముంతాజ్ అనుచరుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ‘థర్డ్ ఐ’ టెక్నాలజీ సాయంతో తొలుత ఇమ్రాన్ ను, అతడిచ్చిన సమాచారం మేరకు రాషేద్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల పాతబస్తీకి చెందిన మహ్మద్ పహిల్వాన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో చేరిన సందేశాలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాను కూడా ఆ తరహా సంచలనం రేపేందుకే ఈ మెసేజ్ ను పోస్ట్ చేసినట్లు రాషేద్ పోలీసులకు తెలిపాడు.