: గూగుల్ గురించి మీకెవ్వరూ చెప్పని కొత్త సంగతులు!
గూగుల్... ప్రపంచంలోనే ఉద్యోగులు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో విధులు నిర్వర్తించే చోటు. సంస్థ గురించిన ఎన్నో తెలియని విషయాలను సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లాస్ జ్లో బాక్ వెల్లడించారు. ఇంటర్వ్యూలు జరిగే తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2006లో తాను చేరినప్పుడు ఉన్న 6 వేల మంది ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 60 వేలకు పెరుగగా, దాదాపు 100కు పైగా పర్ఫామెన్స్ అవార్డులను అందుకున్న బాక్, గూగుల్ పై తాను రాసుకున్న వర్క్ రూల్స్, మేనేజ్ మెంట్ వ్యూహాలు తదితరాల గురించి ఇంకా ఏం చెప్పాడంటే... తొలి 10 సెకన్లలోనే అటా ఇటా...: గూగుల్ లో ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళితే, తొలి పది సెకన్లలోనే అతనికి ఉద్యోగం ఇవ్వాలా? వద్దా? అన్న విషయం ఖరారైపోతుంది. కుర్చీలో కూర్చోక మునుపే ఓ నిర్ణయానికి వచ్చే ఇంటర్వ్యూ కమిటీ, ఆపై అడిగే ప్రశ్నలన్నీ, అభ్యర్థి గురించిన మరింత సమాచారం తెలుసుకునేందుకే. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించేందుకు వీలుండదు. బ్రెయిన్ టీజర్ ప్రశ్నలకు, ఉద్యోగానికీ సంబంధం లేదు: నువ్వు సాల్వ్ చేసిన అతిపెద్ద సమస్య ఏంటి?, మొన్న ఏడేళ్ల వయసున్న క్రిస్, వచ్చే సంవత్సరం పదేళ్ల వాడు ఎలా అవుతాడు? ఇలాంటి 'మెదడుకు మేత' ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు విజయావకాశాలపై ఏ మాత్రం ప్రభావితం చేయవు. వీటికి ఇచ్చే సమాధానం ఎంతసేపట్లో ఇచ్చారన్నది మాత్రమే చూస్తారు తప్ప దానిలో తప్పు, ఒప్పులు, లాజిక్ గురించి కమిటీ ఆలోచించదు. మేనేజర్లకే అన్ని పవర్లూ ఉండవు: విధుల్లో భాగంగా మీరెలా పనిచేస్తున్నారన్నది పర్యవేక్షించేందుకు ఓ మేనేజర్ ఉన్నప్పటికీ, మీపై నిర్ణయాలు ఆయన మాత్రమే తీసుకోలేడు. వారిపైనా మరో మేనేజర్ ఉంటాడు. చిన్న చిన్న విషయాలపై మరింత దృష్టి పెడితే మంచిది: ఓ ఉద్యోగి చిన్న చిన్న విషయాలపై దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నతోద్యోగుల కళ్లలో పడొచ్చు. ఉద్యోగి తన శక్తియుక్తులను ప్రదర్శించడం, చేస్తున్న పనిపై తక్షణ ఫీడ్ బ్యాక్ పంపడం, తెలిసిన పనిని చకచకా చేస్తూ పోవడం లక్షణాలుగా ఉంటే గూగుల్ యాజమాన్యం వేగంగా గుర్తిస్తుంది. మీలో నైపుణ్యం ఉంటే ఎంతైనా ఇస్తుంది: ఒక ఉద్యోగికి రూ. 6.5 కోట్ల విలువైన ఈక్విటీ వాటాలు ఇచ్చిన కంపెనీ అదే స్థాయిలోని మరో వ్యక్తిని రూ. 65 లక్షలకు పరిమితం చేయడం గూగుల్ లో గమనించవచ్చు. ఇందుకు ఒకే ఒక్క కారణం టాలెంట్. నైపుణ్యమున్న ఉద్యోగిని వదులుకునేందుకు సంస్థ ఎంతమాత్రమూ ఇష్టపడదు. అతనికి ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేస్తుంది. ఇందుకు హోదా, చదువు అడ్డంకులు కాదు. ఉద్యోగికి మరో కాల్ వస్తుందనుకుంటే పొరపాటే: సంస్థలో ఉద్యోగ ఆఫర్ వచ్చిన వ్యక్తి, తన శక్తిసామర్థ్యాలను అదనంగా ఊహించుకుని, రిక్రూటర్ల నుంచి మరో కాల్ వస్తుందని, ఇంకాస్త ఆఫర్ పెంచుతారని భావిస్తే పొరపాటు చేసినట్టే. ఉద్యోగార్థి నైపుణ్యం, విద్యార్హతలను బట్టి ప్రపంచంలోనే మంచి పారితోషికాన్ని ఆదిలోనే ఆఫర్ చేసే గూగుల్, దాన్ని సవరించాలని ఎన్నడూ భావించదు. ఇవి బక్ వెల్లడించిన గూగుల్ గురించిన కొన్ని తెలియని సంగతులు. ఆయన తన అనుభవాలను క్రోడీకరిస్తూ రాసిన ఈ పుస్తకం ఇప్పుడు గూగుల్ ఉద్యోగుల హాట్ టాపిక్.