: తమిళ యువ హీరో విశాల్ పై శరత్ కుమార్ క్రిమినల్ కేసు
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికలు తమిళ చిత్రసీమలో పెను వివాదానికి తెర తీశాయి. ప్రస్తుతం నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరోమారు ఆ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో శరత్ కుమార్ పై పలు ఆరోపణలు చేసిన యువ హీరో విశాల్ ఆయనకు పోటీగా నడిగర్ సంఘం అధ్యక్ష బరిలో దిగేందుకు సిద్ధ పడ్డాడు. దీనిపై ఇరువర్గాల మధ్య కొన్నిరోజులుగా మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఘాటు విమర్శలు గుప్పించుకున్న ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలకూ తెరతీశాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపై విశాల్ చేసిన ఆరోపణలన్నింటినీ పూసగుచ్చిన శరత్ కుమార్ యువ హీరోపై నిన్న ఎగ్మూర్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న విశాల్ కూడా ఘాటుగానే స్పందించాడు. శరత్ కుమార్ పై తాను కూడా కేసు నమోదు చేయనున్నట్లు అతడు ప్రకటించాడు.