: స్టెప్పులేసిన కోదండరాం!... విమలక్క పాటకు కాలు కదిపిన టీ జేఏసీ చీఫ్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలెట్టిన మలిదశ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరాం జీవం పోశారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) పేరిట ఏర్పడ్డ అన్ని సంఘాల ఉమ్మడి సంఘానికి చైర్మన్ గా వ్యవహరించిన కోదండరాం, ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఉద్యమంలో తెలంగాణవాదులు ఆడి పాడారు. ప్రపంచంలో అప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అన్ని రకాల ఉద్యమ రీతులు కోదండరాం కారణంగా తెలంగాణ నేలపై నాట్యం చేశాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రొఫెసర్ గా కోదండరాం పదవీ విరమణ చేశారు. అయితే జేఏసీ చైర్మన్ గా మాత్రం ఆయన విరమణ చేయలేదు. ముదిమి వయసులోనూ బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నారు. నిన్నటిదాకా ఉద్యమానికి అన్నీ తానై నడిచిన కోదండరాం గంభీరంగానే కనిపించారు. పక్కనే డప్పులు, డ్యాన్సులు హోరెత్తుతున్నా, ఆయన కాలు మాత్రం కదపలేదు. అయితే నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కాలు కదిపారు. చిన్నపాటి స్టెప్పులేశారు. దీంతో తెలంగాణ వాదులు పులకించిపోయారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత విమలక్క పాట అందుకోగా, కోదండరాం కాలు కదిపారు. విమలక్క పాటకు వేదికపైనే కోదండరాం ఉత్సాహంగా స్టెప్పులేశారు.

More Telugu News