: ఐదేళ్లలో 11 మంది అణు శాస్త్రవేత్తల మరణం... అన్నీ అసహజ మరణాలే!
ఓ వైపు దాయాది దేశం పాకిస్థాన్ ఏటేటా తన అణ్వస్త్ర పాటవాన్ని పెంచుకుంటోంది. పక్కలో బల్లెంలా తయారైంది. తాజాగా ఆ దేశంలో అణు ఒప్పందం చేసుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో భారత్ కూడా ఈ దిశగా తన అణ్వస్త్ర పాటవాన్ని పెంచుకోకపోతే ముప్పు తప్పదన్న వాదన వినిపిస్తోంది. అయితే గడచిన ఐదేళ్లలో ఏకంగా 11 మంది అణు శాస్త్రవేత్తలను భారత్ కోల్పోయింది. ఐదేళ్ల కాలంలో చనిపోయిన 11 మంది అణు శాస్త్రవేత్తలవి అసహజ మరణాలేనన్న కఠోర వాస్తవం భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు అణు శక్తి విభాగం ఇచ్చిన సమాధానం ఈ ఆందోళనకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.
చనిపోయిన 11 మంది అణు శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఓ శాస్త్రవేత్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో జరిగిన పేలుళ్లలో మృతి చెందారు. ట్రాంబేలోని బార్క్ లో పనిచేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలు ఉరేసుకుని చనిపోయారు. రావత్ భటాలో వీరి గ్రూపుకే చెందిన మరో సైంటిస్ట్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు శాస్త్రవేత్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సైంటిస్ట్ ను ముంబైలోని ఆయన స్వగృహంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించడంలో పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి సాధించలేదు.