: మోదీ జీ, ప్లీజ్ హెల్ప్... 96 శాతం మార్కులొచ్చినా ఉద్యోగం ఇవ్వలేదని వాపోతున్నాడు!
రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షల్లో భాగంగా తాను 96 శాతం మార్కులు తెచ్చుకున్నప్పటికీ, తనకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడో ఢిల్లీ నిరుద్యోగి. వివరాల్లోకి వెళితే, తాను 2013లో గ్రూప్-డీ పరీక్ష రాశానని, చాలా బాగా పరీక్షను రాసినప్పటికీ, ఉద్యోగం రాకపోవడంతో అనుమానంతో స.హ చట్టం సాయంతో సమాచారం సేకరించి అవాక్కయ్యానని లలిత్ కుమార్ చెబుతున్నాడు. తన ప్రశ్నలకు ఏడాది తరువాత సమాధానం వచ్చిందని, అక్రమ పద్ధతుల్లో మార్కులు సంపాదించానని ఆరోపిస్తూ అధికారులు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్టు అందులో ఉందని తెలిపాడు. దీంతో తాను సీఐసీ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్)ను ఆశ్రయించానని, నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రైల్వే పీఆర్ఓను సీఐసీ ఆదేశించిందని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని ప్రధానికి లేఖ రాశానని, ప్రధాని కల్పించుకుని ఎలాగైనా తనకు ఉద్యోగం ఇప్పించాలని లలిత్ కుమార్ అభ్యర్థిస్తున్నాడు.