: భూతాపంపై సరిగ్గా స్పందించకుంటే మండి, మాడి, మసైపోతాం: ఐఎంఎఫ్ చీఫ్

ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుంటే మానవాళి పెను ప్రమాదంలో పడినట్టేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే హెచ్చరించారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే భూమి ఓ నిప్పుల కొలిమి అవుతుందని అభిప్రాయపడ్డ ఆమె, "అందరూ కలిసి సంయుక్తంగా సమస్యను అధిగమించాలి. లేకుంటే భూమిపై ఉన్న ప్రజలంతా మండి, మాడి, మసైపోతారు" అని అన్నారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిన్, యఎన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఫిగ్యూరెస్, ప్రముఖ ఎకానమిస్ట్ నికోలస్ స్టెర్న్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఓ ప్యానల్ డిస్కషన్ లో ఆమె మాట్లాడారు. "చేయాలనుకుంటున్న పని అనుకున్నంత సులభం కాదని తెలుసు. కానీ మానవాళి కోసం తప్పదు. ఇందుకోసం భారీ నిధులు కేటాయించాలి. భూగర్భంలోని ఇంధన వనరులను వాడకుండా, సూర్యరశ్మి వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల దిశగా సాగాలి" అని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇస్తున్న ఇంధన సబ్సిడీలను తక్షణం తొలగించాలని ఆమె సలహా ఇచ్చారు. ఈ డబ్బును ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధికి కేటాయించాలని కోరారు. తాను చెప్పే మాటలు రాజకీయ నాయకులకు నచ్చవని, టాక్సీ, లారీ డ్రైవర్లు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతారన్నది వారి భయమని అన్నారు.

More Telugu News