: శ్రీచైతన్యలో స్టూడెంట్స్ ఫైటింగ్... కత్తులతో యుద్ధం, విద్యార్థికి తీవ్ర గాయాలు

చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల ఉదంతాలతో తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యలో అగ్రగాములైన నారాయణ, శ్రీచైతన్య కళాశాలపై విమర్శల జడివాన కురుస్తోంది. తాజాగా, శ్రీచైతన్యకు చెందిన ఓ కళాశాలలో నిన్న రాత్రి జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. శ్రీచైతన్య విశాఖ క్యాంపస్ లోని హాస్టళ్లో గత రాత్రి విద్యార్థుల మధ్య భారీ ఫైటింగ్ జరిగింది. సెల్ ఫోన్ చోరీ అయిందన్న విషయంపై విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతి మించి ఫైటింగ్ కు దారి తీసింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హాస్టల్ గదులను రణరంగంగా మార్చేశారు. కత్తులు చేతబట్టి పరస్పర దాడులకు దిగారు. ఈ దాడిలో గిరీశ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులకు గిరీశ్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News