: సభలో విపక్షాలుంటే మజా ఉండేది... అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ కామెంట్!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ఆసక్తికర కామెంట్ చేశారు. రైతుల రుణమాఫీ కోసం ‘సింగిల్ సెటిల్ మెంట్’ను డిమాండ్ చేస్తూ మూకుమ్మడిగా సర్కారుపై దాడికి దిగిన తెలంగాణ రాష్ట్ర విపక్షాలనన్నింటినీ సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి సభలో విపక్షాల సీట్లన్నీ ఖాళీగా కనిపించాయి. సభలో వాటర్ గ్రిడ్ పై కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన ఆయనను లాబీల్లో మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. విపక్షాలు లేకుండా సభను నడపడం బాగుందా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన ‘సభలో విపక్షాలు ఉంటేనే మజాగా ఉందేది’ అని వ్యాఖ్యానించారు.