: ప్రముఖ హాలీవుడ్ నటుడి దత్తపుత్రిక రహస్య వివాహం
సినీ నటుల రహస్య వివాహాలు చేసుకుంటుండటం అందరికీ తెలిసిన విషయమే. కానీ, ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ దత్తపుత్రిక ఇసబెల్లా క్రూజ్, తన బాయ్ ఫ్రెండ్ మాక్స్ పార్కర్ ను రహస్యంగా వివాహం చేసుకుంది. లండన్ లో హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్న ఇరవై రెండేళ్ల ఇసబెల్లా, ఐటీ కన్సల్టెంట్ అయిన పార్కర్ తో ఏడాది కాలంగా డేటింగ్ చేసింది. వీళ్లిద్దరూ నెలరోజుల కిందట వివాహం చేసుకున్నారు. లండన్ లోని ప్రఖ్యాత డోర్చెస్టర్ స్టార్ హోటల్ లో ఈ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. తమ కూతురి వివాహానికి టామ్ క్రూజ్, అతని మాజీ భార్య నికోల్ కిడ్ లు మాత్రం హాజరుకాలేదు. కాకపోతే, కూతురి వివాహం గురించి టామ్ క్రూజ్ కు ముందే తెలుసని, పెళ్లి ఎలా జరిగిందనే విషయమై ఆయన ఆరా తీసినట్లు విమెన్స్ డే మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇదిలా ఉండగా టామ్, నికోల్ భార్యాభర్తలుగా కలిసున్న సమయంలో ఇసబెల్లాను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.