: చంద్రబాబు గుడికి స్థలం ఎంపిక... ముహూర్తమే వాయిదా పడింది!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి గుడి కట్టేందుకు తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన రైతు బుడ్డి సతీశ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు గుడిపై తాను చేసిన ప్రకటనకు కట్టుబడ్డ సతీశ్ నిన్న వాస్తు సిద్ధాంతి వెంకటనారాయణతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. కృష్ణా నది తీరాన పుష్కర ఘాట్ సమీపంలోని సతీశ్ స్థలాన్ని వాస్తు సిద్ధాంతి ఖరారు చేశారు.
నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన రోజుననే చంద్రబాబు గుడి నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలని సతీశ్ ముందుగా అనుకున్నాడు. అయితే వాస్తు సిద్ధాంతి వెంకటనారాయణ ఆయనను వారించారు. రాజధాని శంకుస్థాపన రోజు గుడి నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టడం శుభపరిణామం కాదని ఆయన సతీశ్ కు చెప్పారట. సిద్ధాంతి మాటపై విశ్వాసమున్న సతీశ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అమరావతి శంకుస్థాపన రోజు కాకుండా మరో మంచి ముహూర్తాన్ని ఖరారు చేయాలని ఆయన సిద్ధాంతిని కోరారట.