: కళాత్మక చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత!

ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆయన రెండు వారాల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అయితే మల్టిపుల్ ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల ఆయన మృతి చెందారని అన్నారు. రేపు టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఏడిద నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. కాగా, ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా పలు ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మించారు. పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ స్థాపించి పలు ఆణిముత్యాల లాంటి చిత్రాలను ఆయన నిర్మించారు. సిరిసిరిమువ్వ, తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు వంటి ఆణిముత్యాలను ప్రేక్షకులకు ఆయన అందించారు. సినిమా అన్నది వ్యాపారం అయిపోయిన రోజుల్లో ఆయన తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఒక నిబద్ధతతో చిత్ర నిర్మాణాన్ని సాగించారు. ఎటువంటి అసభ్యతకు తావులేని, కళాత్మకతతో కూడిన కుటుంబ కథాచిత్రాలను నిర్మించడమే ధ్యేయంగా ఆయన తన ప్రస్థానాన్ని సాగించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ తో ఆయన అనుబంధం విడదీయలేనిది. వీరిద్దరి కలయికలో వచ్చిన శంకరాభరణం చిత్రం తెలుగు సినిమా స్థాయిని దశదిశలా వ్యాపింపజేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలను, సంగీత నృత్యాలను మేళవించి రూపొందించిన ఆ చిత్రం రసజ్ఞతతో కూడిన దృశ్యకావ్యంగా నిలిచింది. తనతో బాటు వచ్చిన నిర్మాతలంతా ట్రెండులో పడి కొట్టుకుపోతున్నా, తాను మాత్రం ఏటికి ఎదిరీదినట్టుగా నిలబడి తన పరిధి దాటకుండా ఉత్తమ చిత్రాలను మాత్రమే నిర్మిస్తూవచ్చారు ఏడిద నాగేశ్వరరావు. చిత్ర నిర్మాణంలో వచ్చిన కొత్త పోకడలతో కాలం మారిపోవడంతో, ఇక తనబోటి నిర్మాతలకు స్థానం లేదని తెలుసుకున్నాక, ట్రెండుతో రాజీపడలేక గత కొన్నేళ్లుగా ఆయన చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వున్నారు.

More Telugu News