: ఇన్ఫోసిస్ నుంచి సరికొత్త సేవలు... 'ఐటీ' కాదు 'ఐఓటీ'!
ఐటీ సేవల విభాగాన్ని తదుపరి తరానికి తీసుకెళ్లేలా 'ఐఓటీ' (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సొల్యూషన్స్ సేవలను అందించనున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇందుకోసం తమ దీర్ఘకాల క్లయింట్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, పలు రకాల అప్లికేషన్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి, వివిధ రకాల యంత్రాలను సెన్సార్లతో, ఆపై నెట్ వర్క్ తో అనుసంధానం చేసి, సాఫ్ట్ వేర్ ద్వారా వాటిని పనిచేయించడమే ఐఓటీ అని సంస్థ వెల్లడించింది. జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో రెండు పైలట్ ప్రాజెక్టులను చేపట్టామని, వీటికి సిస్కో, ఐబీఎం, ఏటీఅండ్ టీ, ఇంటెల్ తదితర సంస్థల నుంచి పూర్తి మద్దతు లభించిందని వివరించింది. ఇంటర్నెట్ విస్తరణ ఇండస్ట్రీస్ కు విస్తరించడంలో తమ వంతు పాత్రను ఐఓటీ సేవలు నిర్దేశించనున్నాయని పేర్కొంది. వస్తు ఉత్పత్తి, వినియోగానికి మధ్య యాంత్రీకరణను తగ్గించి, మానవ శ్రమను ఆదా చేయడమే దీని లక్ష్యమని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ శిక్కా వ్యాఖ్యానించారు. ఐఓటీ అమలు వల్ల క్లిష్టతరమైన తయారీ ప్రక్రియ సులువుగా మారుతుందని, విఫలమయ్యే సందర్భాలూ గణనీయంగా తగ్గుతాయని ఆయన తెలిపారు. సుమారు 146 బిలియన్ డాలర్లకు విస్తరించిన భారత ఐటీ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ విభాగం ఇప్పుడిప్పుడే కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందడుగు ప్రారంభించిందని పేర్కొన్నారు.