: గల్లీలో లొల్లి వద్దు... సత్తా ఉంటే నిధులు సాధించండి: బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో నేటి ఉదయం విపక్షాలు వ్యవహరించిన తీరుపై ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో సోమవారానికి సభ వాయిదా పడ్డ తర్వాత కొద్దిసేపటి క్రితం కేటీఆర్ సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాల తీరును ఎండగట్టారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.
ఈ క్రమంలో ఏపీకి కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయన్న వార్తలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొరుగు రాష్ట్రానికి నిధులు రావడం మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. తత్ఫలితంగా ఏపీ ప్రజలకు మేలు జరగాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అయితే కేంద్రం కూడా రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఓసారి పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం మేరకు ఏపీ తరహాలోనే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు.
ఈ విషయంలో కేంద్రం వద్ద పరపతి ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, సభలో ఆ పార్టీ నేత లక్ష్మణ్ లు ఢిల్లీ వెళ్లి నిధులు సాధించుకుని రావాలని ఆయన కోరారు. కేంద్రం వద్ద రాష్ట్ర డిమాండ్లను ఉంచాల్సిన గురుతర బాధ్యతను మరచిన కిషన్ రెడ్డి గల్లీల్లో లొల్లి చేయడం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.