: విషం కక్కిన జీడిమెట్ల ఫ్యాక్టరీ... ఒకరి మృతి

హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా విషం చిమ్ముతోంది. నిబంధనలను గాలికొదిలి, విష వాయువులను గాల్లోకి వదులుతోంది. దీనిపై ఇప్పటికే ఎంతో చర్చ జరిగినా, ఫలితం మాత్రం శూన్యం. తాజాగా, జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫాక్టరీ నుంచి వెలువడిన విష వాయువు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళ్తే, వసంత కెమికల్స్ అనే కంపెనీ నుంచి నిన్న రాత్రి విషవాయువును విడుదల చేశారు. ఈ క్రమంలో, అదే కంపెనీలో రెండో షిఫ్టులో పనిచేస్తున్న నర్సింగరావు (39) అనే వ్యక్తి ఆ వాయువును పీల్చి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అయితే, అతనిని గుట్టుచప్పుడు కాకుండా సదరు కంపెనీ యాజమాన్యం గాంధీ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సింగరావు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం సరిగా స్పందించడం లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో, పోలీసులు కంపెనీకి చేరుకుని విచారణ చేపట్టారు. నర్సింగరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

More Telugu News