: అక్బరుద్దీన్ పిట్టకథే కేటీఆర్ కు కోపం తెప్పించిందట... ఆ కథ ఏంటంటే...!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్నటి సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వమే చర్చకు అనుమతించిన నేపథ్యంలో విపక్షాలకు చెందిన నేతలంతా మాట్లాడినప్పటికీ కేటీఆర్ కు కోపం రాలేదు. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడిన దానికి మాత్రం కేటీఆర్ అంతెత్తున ఎగిరిపడ్డారు. ఆ తర్వాత అక్బరుద్దీన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారులెండి. అయినా అక్బరుద్దీన్ ఏం మాట్లాడితే, కేటీఆర్ కు కోపం వచ్చిందంటే... తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఓ పిట్ట కథ చెప్పారు. ‘‘ఓ గాయకుడు రాజ దర్బారులో పాటలు పాడేవాడు. గాయకుడికి ప్రతిరోజూ డబ్బు ఇస్తున్నట్లు, పొలం ఇస్తున్నట్లు రాజు ప్రకటించేవాడు. చివరి రోజున తనకు ఇస్తానన్న డబ్బు, పొలం ఇస్తే తీసుకెళతానని గాయకుడు రాజును అడిగాడు. ‘నువ్వు పాట పాడి మమ్మల్ని ఆనందింపజేశావు. నేను కానుకలు ఇస్తున్నట్లు చెప్పి నిన్ను ఆనందింపజేశాను. దానికీ, దీనికీ చెల్లు’ అని రాజు బదులిచ్చాడు. రాష్ట్రంలో రైతుల పరిస్థితీ అలాగే ఉంది. ప్రతిసారీ చర్చించడం, అది చేస్తాం... ఇది చేస్తాం అని వరాలు ఇవ్వడం, తర్వాత వాటి గురించి మరిచిపోవడం!’’ అంటూ అక్బరుద్దీన్ సర్కారు తీరును ఎండగట్టారు. అప్పటిదాకా ఓపిగ్గా విపక్షాల ఆరోపణలు వింటున్న కేటీఆర్, ఈ పిట్ట కథతో ఒక్కసారిగా ఫైరయ్యారు.

More Telugu News