: ‘ఎంఎస్ బ్లూ’ శారీలకు మళ్లీ డిమాండ్!

'కౌసల్యా... సుప్రజా... రామా...' అంటూ పొద్దున్నే గుడిలోంచి శ్రావ్యంగా వినిపించే సుప్రభాతం మన కళ్లముందు ఆ మధురగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మిని సాక్షాత్కరింపజేస్తుంది. అలాంటి శాస్త్రీయ సంగీతకళాకారిణి సుబ్బులక్ష్మి పాడిన పాటలే కాదు, ఆమె వస్త్రాలంకరణ కూడా ఎంతో విశేషంగా, హుందాతనంగా ఉండేవి. ఇప్పుడు ఆమె శతజయంత్యుత్సవాల సందర్భంగా ఆమె పాడిన పాటలు, ఆమె ఆధ్యాత్మికత వంటి విషయాల గురించి అభిమానులు ప్రస్తావించుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె ధరించిన కాంజీవరం చీరల గురించి కూడా మహిళలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఎంఎస్ సుబ్బులక్ష్మి ధరించిన అందమైన నీలం రంగు కాంజీవరం చీర చాలా ఫేమస్. ఆ రంగును... ‘ఎంఎస్ బ్లూ’ లేదా ‘మాయిల్ కజుత్ కలర్’గా పిలిచేవారు. ఒకప్పుడు అదే రంగు కాంజీవరం చీరల కోసం ఆర్డర్లు ఇచ్చి మరీ మహిళలు తమ కోసం వాటిని తయారు చేయించుకునేవారట. అదే రంగు చీరలు నేటి ‘ఫ్యాషన్’ ప్రపంచంలోకి మళ్లీ వచ్చాయి. చెన్నైలోని సిల్క్ శారీ షాపులలో ఈ చీరలు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కో-ఆప్టెక్స్ షోరూమ్ లలో కూడా ఎంఎస్ బ్లూ చీరల అమ్మకాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఎంఎస్ బ్లూ చీర ప్రత్యేకత... కాంచీపురానికి చెందిన వీవర్ ముత్తు చెట్టియార్ కు ఎంఎస్ సుబ్బులక్ష్మి పాటలంటే ప్రాణం. సంగీత వ్యామోహంలో పడిపోయిన చెట్టియార్ తన వృత్తిని కూడా వదిలేసి, కాంచీపురంలో విద్వాంసుడు అయిన నైనా పిళ్ళయ్ అనే గురువు వద్ద శిష్యుడిగా చేరాడు. ఎంఎస్ సుబ్బులక్ష్మి మరణానంతరం ఆయన మళ్లీ తన వృత్తిలోకి వచ్చాడు. చెట్టియార్ నేసిన చీరలంటే ఆ రోజుల్లో చాలా ప్రజాదరణ పొందాయి. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారు ఆయన నేసిన చీరలను కొనుగోలు చేసేవారు. 1960 లో ఎంఎస్ సుబ్బులక్ష్మి కోసం బ్లూ కలర్ సిల్క్ చీరను చెట్టియార్ నేశాడు. ఈ చీర ఎంతో బాగుందంటూ నాడు ప్రశంసల వర్షం కురిసింది. మహిళలు ఇష్టపడి మరీ ఈ రంగు సిల్క్ చీరలను కొనుగోలు చేసేవారట.

More Telugu News