: సర్కారును కడిగిపారేసిన అక్బరుద్దీన్... సాటి ప్రతిపక్షాలనూ వదలలేదు!
తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కడిగిపారేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉదాసీన వైఖరితో పాటు విపక్షాల బాధ్యతారాహిత్యాన్ని కూడా ఎండగట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యల సంఖ్యను ప్రస్తావించిన అక్బరుద్దీన్, వాటిని నిలువరించేందుకు ఏం చేశారని నిలదీశారు.
రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాల్సిన విపక్షాలు ఆ బాధ్యతను మరిచి సభలో నిరసనలకు దిగుతూ రాద్ధాంతం సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు శూన్యమని ఆయన నిందించారు. రైతు ఆత్మహత్యలకు ఒక్క ప్రభుత్వమే కారణం కాదని, ప్రజాప్రతినిధులంతా కారణమేనని వ్యాఖ్యానించారు. ఆత్మహత్యల పాపమంతా ప్రకృతిదేనంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమని కూడా ఆయన ప్రశ్నించారు. ఆత్మహత్యలపై ఏటా చర్చించుకోవడం తప్ప ప్రజా ప్రతినిధులు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు.