: శాప్ సెంటర్ లో ‘చక్ దే ఇండియా’ హోరు...మోదీతో కరచాలనం కోసం ఎగబడ్డ ఎన్నారైలు
అమెరికాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి వేదికగా నిలిచిన కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ ‘చక్ దే ఇండియా’ పాటతో హోరెత్తింది. శాప్ సెంటర్ కు మోదీ చేరుకోగానే అప్పటికే హౌస్ ఫుల్ అయిన శాప్ సెంటర్ భారత్ నినాదాలతో మారుమోగింది. ఆ తర్వాత తన ప్రసంగంలో మోదీ చేసిన కీలక వ్యాఖ్యలకు భారీ స్పందన లభించింది. చప్పట్లతో పాటు వారంతా మోదీ వ్యాఖ్యలపై హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
మోదీ ప్రసంగం ముగించగానే నిర్వాహకులు బాలీవుడ్ హిట్ మూవీ ‘చక్ దే ఇండియా’లోని టైటిల్ సాంగ్ ను ప్లే చేశారు. ఈ సందర్భంగా మోదీ వేదిక దిగుతుండగా ఎన్నారైలు ‘మోదీ, మోదీ’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఇక మోదీ తన భద్రతను పక్కనపెట్టేసి జన సమూహంలో కలిసిపోయారు. తన ప్రసంగం వినేందుకు వచ్చిన ఎన్నారైలతో కరచాలనం చేశారు. నమస్కారం పెడుతూ వేదిక ఎక్కిన మోదీ, దిగేటప్పుడు మాత్రం ఎన్నారైలతో చేయి కలిపారు. మోదీతో కరచాలనం చేసేందుకు అక్కడి ఎన్నారైలు పోటీలు పడ్డారు.