: జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత పొడిగింపు
భద్రతా కారణాల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల నిలిపివేతను మరోమారు పొడిగించారు. బ్రాడ్ బ్యాండ్ సేవలను ఆదివారం రాత్రి 8 గంటల వరకు, మొబైల్ ఇంటర్నెట్ సేవలను రేపు ఉదయం 10 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర పోస్టుల ద్వారా మతఘర్షణలకు ఆస్కారం ఉండటంతోనే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు చెప్పారు. నిఘా వర్గాల నేపథ్యంలో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు గత గురువారం నాడు ఇక్కడి ప్రభుత్వం ప్రకటించింది. శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ ను నిలిపివేస్తున్నామని అధికారులు నిన్న ప్రకటించారు. అయితే, ప్రజలు మాత్రం ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేతను పొడిగించడంపై ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారులు తమకు చాలా అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు.