: మహాగణపతి నిమజ్జనం ఇలా..!
ఖైరతాబాద్ లో కొలువై లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం షెడ్యూల్ విడుదలైంది. ఈ మహాక్రతువును ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగించేందుకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి ప్రజలను అనుమతిస్తారు. ఆపై 3 గంటల ప్రాంతంలో గణేశుని చేతిలో ఉన్న 6 వేల కిలోల లడ్డూను కిందకు దింపి భద్రపరుస్తారు. ఈ లడ్డూను 30వ తేదీన భక్తులకు పంచుతారు. మహా గణపతి విగ్రహాన్ని నిలిపివుంచిన మెటల్ బీమ్స్ ను వెల్డింగ్ తో తొలగించిన తరువాత రాత్రి 8 గంటలలోపు విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. సాయంత్రం 5 గంటల కెల్లా మహా నిమజ్జనం ప్రారంభమవుతుందని, ఖైరతాబాద్ విగ్రహం కదిలే సమయానికి నక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కనీసం 1000 విగ్రహాలు నిమజ్జనం చేయించడం ద్వారా ట్రాఫిక్ ను కొంత క్లియర్ చేయాలన్నది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది. సోమవారం ఉదయం తరువాత నాలుగో క్రేన్ తో మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు.