: విషాహారం పెట్టి 130 కుక్కల్ని చంపేశాడు!
ఎటువంటి ఆయుధాలూ ఉపయోగించకుండా నూట ముప్ఫై వీధి కుక్కలను అవలీలగా చంపేశాడు కేరళకు చెందిన ఎంజె షఫీ. ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆయన్ని ప్రశ్నిస్తే పొరుగువారు వీధికుక్కల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారని, చాలా బాధగా ఉందని సమాధానం చెబుతున్నాడు. పొరుగు కుటుంబాల వాళ్ల మద్దతుతోనే తాను ఈ పని చేశానని చెప్పాడు. అన్ని కుక్కలను ఏ విధంగా చంపేశాడంటే.. మాంసం ముక్కలకు విషం పూసి ఆ ముక్కలను కుక్కలకు వేసేవాడు. ఆ ముక్కలు తిన్న కుక్కలు కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు వదిలేవి. ఆ తర్వాత కుక్కల మృతదేహాలను పాతి పెట్టేసేవాడు. షఫీ ఈ విషయాలన్నింటిని ఒక ఆంగ్ల మీడియా చానెల్ కు పూసగుచ్చినట్లు చెప్పడమే కాదు, కుక్కలను చంపిన స్థలంతో పాటు వాటిని ఎక్కడ పూడ్చిపెట్టిన స్థలాన్ని దగ్గరుండి మరీ చూపించాడు.
‘ప్రజల ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలను చంపడం తప్పని ఎవరైనా అనుకుంటే, నేను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనంటున్నాడు’ నలభై మూడు సంవత్సరాల ఈ ఆటోడ్రైవర్. ఎర్నాకుళంకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ మువ్వత్త్పుజా షఫీ స్వస్థలం. ‘గత ఆరు నెలల కాలంలో సుమారు 30 మంది వరకు వీధి కుక్కల బారినపడ్డారు. వారిలో పిల్లలు, పెద్దవారు కూడా ఉన్నారు. వీధికుక్కల దాడిలో నా కొలీగ్ కొడుకు గాయపడ్డాడు. అతనికి హిమోఫిలియా వ్యాధి వుంది. ఏ చిన్న గాయం అయినా రక్తస్రావం జరుగుతుంది. ఐదేళ్ల ఆ బాలుడు ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడు. ఇటువంటి బాధ ఏ పిల్లవాడికి రాకూడదు. ఇప్పటికే అతని చికిత్సకు రూ.95,000 వరకు ఖర్చు అయింది. ఏ వీధికుక్క పిల్లల్ని కరవకూడదు. అందుకే పొరుగువారి మద్దతుతో వాటిని చంపడం మొదలు పెట్టాను. ప్రభుత్వం లేదా పంచాయతీ అధికారులు వీధికుక్కల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు’ అని షఫీ చెప్పాడు. కాగా, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఫిర్యాదు మేరకు షఫీ పై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.