: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ బాలు
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. గత 320 రోజులుగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ కార్యక్రమం అమల్లో చల్లపల్లి దేశానికే ఆదర్శంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలుతో పాటు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.