: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు... గుంతకల్ లో నీట మునిగిన రైల్వే ట్రాక్, నిలిచిన రైళ్ల రాకపోకలు

తెలుగు రాష్ట్రాలను వాన దేవుడు ముంచెత్తుతున్నాడు. గడచిన రాత్రి నుంచి మొదలైన వర్షం క్రమంగా ఊపందుకుంది. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా గుంతకల్ లో కురిసిన భారీ వర్షానికి రైల్వే జంక్షన్ లోని రైల్వే ట్రాక్ నీట మునిగింది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లో ప్రధాన జంక్షన్ గా ఉన్న గుంతకల్ లో రైల్వే ట్రాక్ నీట మునగడంతో డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి. అనంత, కర్నూలు జిల్లాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ జిల్లాల మీదుగా ఉన్న హైదరాబాదు-బెంగళూరు రహదారిపై పలుచోట్ల నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోనూ వర్షం తన ప్రతాపం చూపింది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి పెద్ద సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో భవనంపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఆసుపత్రి భవనం పైకప్పు కుప్పకూలినా, ప్రాణనష్టం తప్పింది. వర్ష బీభత్సానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News