: పనిమనిషిపై లైంగికదాడి: సౌదీ యువరాజు అరెస్టు
ఓ పనిమనిషిని బలవంతం చేసిన సౌదీ యువరాజు మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నాడు అరెస్టు చేసి మర్నాడు విడుదల చేశారు. శృంగారంలో పాల్గొనాలంటూ ఓ పనిమనిషిపై యువరాజు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సుమారు రూ.2 కోట్ల పూచీకత్తుపై ఆయన్ని విడుదల చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 19న మజిద్ కోర్టులో హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సంఘటన చూసిన పొరుగు వ్యక్తి కథనం ప్రకారం...మజీద్ ఎస్టేట్ లోని ఓ మహిళ తనకు సాయం చేయమంటూ కేకలు పెట్టింది. ఆమె రక్తస్రావంతో ప్రహరీ గోడ దాటేందుకు ప్రయత్నిస్తుండగా తాను చూసినట్లు పోలీసులకు చెప్పాడు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు సౌదీ యువరాజు, సౌదీ దౌత్య కార్యాలయం అధికారులు కూడా అందుబాటులోకి రాలేదు.