: ఏళ్లు, నెలలు నిన్నటి మాట... నేడు 15 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి


ఇల్లు కట్టాలంటే పిల్లర్లు వేయాలి, వాటిని బాగా తడపాలి, ఆ తరువాత గోడలు కట్టాలి, ఆ తరువాత శ్లాబు వేయాలి... దీనికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ బాగా డబ్బులుంటే కనుక ముందు పిల్లర్లు వేసి, శ్లాబు వేసి తరువాత గోడలు నిర్మించవచ్చు. దీనికి కూడా నెలల సమయం పడుతుంది...ఇదంతా నిన్నటి మాట...! నేడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం మూడు నుంచి 15 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా నిర్మాణాలు విదేశాల్లో జరుగుతున్నాయి. వీటిని భారత్ కు పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పేదలకు ఇళ్లు నిర్మించాలంటే పట్టణాల్లో అపార్టుమెంట్ల నిర్మాణం ప్రభుత్వానికి సులువుగా ఉన్నప్పటికీ, గ్రామాల్లో ఈ పరిస్థితి లేదు. అక్కడ ఇండివిడ్యువల్ హౌస్ కావాల్సిందే. అలాంటి చోట్ల ప్రభుత్వ పథకాలు పూర్తయ్యేందుకు ఏళ్లు పడుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ నిర్మాణం ప్రోత్సహించాలని ఏపీ భావిస్తోంది. ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ లో పిల్లర్లు, బీంలు, పైకప్పు ముందుగా నిర్మిస్తారు. వాటిని తరువాత జాయింట్ చేస్తారు. అయితే సంప్రదాయ నిర్మాణాలకు అలవాటు పడిన ప్రజలకు, ఈ తరహా ఇళ్ల నిర్మాణంపై పలు అనుమానాలున్నాయి. అలా జాయింట్ చేసిన ఇళ్లు పటిష్ఠంగా ఉంటాయా? అనేది ప్రధానమైన అనుమానం. ఈ అనుమానాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది. విజయవాడ సమీపంలో ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో వంద ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇవి విజయవంతమైతే ఇలాంటి నిర్మాణాలు మరిన్ని చేపట్టవచ్చని భావిస్తోంది. ప్రస్తుతానికి ప్రీక్యాస్ట్, ప్రీఫ్యాబ్ టెక్నాలజీల్లో ఈ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టనుంది. ఏ టెక్నాలజీలో నిర్మించినా ఇంటి నిర్మాణం 2.72 లక్షల రూపాయలు దాటకూడదని ఏపీ గృహనిర్మాణ శాఖ అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News